కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad Murders) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆరుగురి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్ పై గతంలోనే కేసు నమోదు అయింది. భూతగాదాలలో ఇద్దరిని బెదిరించిన కేసులో అతనిపై షాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యినట్లు తేలింది. అయితే నిందితుడు వేధిస్తున్నాడని గతంలోనే ఫిర్యాదు చేసిన కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారని మైనర్ బాలిక తరఫు మృతుల బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు షాబాద్ పీఎస్ ఎదుట ఉన్న రహదారిపై వారు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ప్రేమ పేరుతో వేధింపులు
నిందితుడు రాజ్‌కుమార్ గత 6 నెలలుగా సదరు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని వెల్లడైంది. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో మైనర్ బాలిక కాలేజీ వెళ్లడం మానేసింది. అయితే ఇటీవల పరీక్షలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి దగ్గరుండి బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లింది. అయితే పరీక్ష ముగిసిన వెంటనే బాలికను అందరూ చూస్తుండగానే లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన రాజ్‌కుమార్.. గతంలో ‘నీ తండ్రిని చంపినట్లే, మిమల్ని చంపేస్తా’ అని బాలికను, ఆమె తల్లిని హెచ్చరించాడు. ప్రాణభయంతో తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు కింద FIR నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
కాగా, బెయిల్ పై విడుదలైన రాజ్‌కుమార్ తనపై పోక్సో కేసు పెట్టారనే కోపంతో రెండు గంటల వ్యవధిలో ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా బాధిత మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మను దారుణంగా చంపాడు. మైనర్ బాలికను బలవంతంగా దైవాలగూడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేసి వివరాలు చెప్పి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీసులు అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

