కలం, వెబ్‌డెస్క్: బీహార్‌లో ఓ జేడీయూ నేత (JDU Leader)కు దొంగలు ఊహించని షాకిచ్చారు. మంత్రి కార్యక్రమంలో నెలకొన్న రద్దీతో హడావుడి ఉన్న నేపథ్యంలో బంగారు చైన్ చోరీకి (Gold Chain Theft)పాల్పడ్డారు. అది చాలా కాస్ట్లీ కావడంతో ఆ నేత లబోదిబోమంటూ దొంగల కోసం వెతకడం మొదలు పెట్టాడు. ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ కుమారుడు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి నిశాంత్ కుమార్ (Nishant Kumar ) ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు జేసీబీతో పూల దండ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ రద్దీ ఏర్పడింది. ఈ జనసందోహాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. సాక్రి చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్ ఆగగానే కార్యకర్తలు గజమాలతో ముందుకు ఎగబడ్డారు. ఈ హడావుడిలో జేడీయూ నేత రాజేష్ మండల్ మెడలో ఉన్న సుమారు రూ.7 లక్షల విలువైన బంగారు గొలుసు చోరీకి గురైంది.
జన సందోహం సాధారణ స్థితికి వచ్చాక మెడ ఖాళీగా ఉండటంతో రాజేష్ ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వారిని ఆరా తీయడం, వెతకడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రద్దీని ఆసరాగా చేసుకుని ఎవరైనా కొట్టేశారా, లేక తొక్కిసలాటలో కిందపడిపోయిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా జన సందోహం ఎక్కువగా ఉన్న చోట విలువైన వస్తువులను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

