కలం, నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ. 10,814 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ (SFI) డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నిర్వహించిన జిల్లా కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. నిరసనకారులతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫీజులు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రచారానికి నిధులుంటాయి.. చదువులకు ఉండవా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు బడ్జెట్ లేదని చెబుతున్న ప్రభుత్వం.. పత్రికలు, టీవీలలో ప్రచార ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, నాయకులు సైదా నాయక్, బుడిగ వెంకటేష్, కోరే రమేశ్, రవీందర్, కిరణ్, జగన్, ప్రణీత్, అదిల్, నవదీప్, ఝాన్సీ, లోహిత్, వర్షిత్, సాయి, హరీశ్, చంటి, జయరాం, పరమేష్, వేణు చారి, మహేశ్ పాల్గొన్నారు.

