ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్

కలం, తెలంగాణ బ్యూరో : రానున్న వారంపాటు పగటి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో ఉంటాయని, కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్ నమోదవుతుందని కేంద్ర, రాష్ట్ర వాతావరణ విభాగాలు హెచ్చరించాయి. తెలంగాణలో ఉత్తర భాగానికి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, జనగాం, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో ఇప్పటివరకు నమోదైనదానికంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే ఉండొచ్చని తెలంగాణ ప్లానింగ్ సొసైటీ పేర్కొన్నది.

నైరుతి రుతుపవనాలు ఈ నెల చివరికల్లా వస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేయగా దానికి ముందుగా ఉండే ప్రీ-మాన్‌సూన్ ఎఫెక్టుతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నాగర్‌కర్నూల్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సగటున 42 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతుందని స్టేట్ ప్లానింగ్ సొసైటీ పేర్కొన్నది.

వారం రోజుల పాటు మండే ఎండలు :

గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది. గత రెండు వారాలుగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. రానున్న వారం రోజుల పాటు మరింతగా ఎండల తీవ్రత ఉంటుందని, కనీస స్థాయిలో రెండు డిగ్రీలు, గరిష్టంగా 3 డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుందని ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది.

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

ఈ హెచ్చరికలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరి పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని, లేదంటే ఇండ్లలోనే ఉండాలని సూచించింది. ఇప్పటికే హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ ద్వారా పలు విభాగాలకు సూచనలు జారీచేసింది. ఉత్తర తెలంగాణలో బొగ్గు బావులు ఉన్న ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల్లో టెంపరేచర్ దాదాపు 47 డిగ్రీలు టచ్ అయ్యే అవకాశాలున్నాయి. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం 45 డిగ్రీలు దాటితే వడగాడ్పులు వీస్తాయని, ఆరుబయట పనుల్లో ఉండేవారికి వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. కనీసంగా ఏడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం 45 డిగ్రీలు దాటే అవకాశముందని సొసైటీ పేర్కొన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>