మే 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు: సీతక్క

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా మే 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులతో స‌హా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుతం మహిళా వారోత్సవాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కీలక ప్రకటన విడుదల చేశారు.

మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క తెలిపారు. మహిళలకు బ్యాంకు రుణాలు, సూక్ష్మ పరిశ్రమలు, జీవనోపాధి యూనిట్లు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని వివరించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన (Women Welfare), భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.

మహిళా వారోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా మే 29న హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్త‌ల కోసం ఇంక్యుబేటర్ ను ప్రారంభించనున్నారు. జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>