కలం, వెబ్ డెస్క్: మైదానంలో పోరాటం.. మ్యాచ్ తర్వాత సంస్కారం. జపాన్ (Japan) అభిమానులు మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. నెదర్లాండ్స్ (Netherlands)తో 2-2తో డ్రా ముగిసిన తర్వాత డల్లాస్‌లోని ఏటీ అండ్ టీ స్టేడియంలో జపాన్ అభిమానులు స్టాండ్లను శుభ్రం చేశారు. మ్యాచ్ సమయంలో చేతుల్లో కనిపించిన నీలం రంగు బ్యాగ్‌లతోనే చెత్తను సేకరించారు. ఈ దృశ్యాలను ఫిఫా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. ఆటగాళ్లు, అభిమానులు, స్టేడియం పట్ల గౌరవం చూపడానికే ఇలా చేస్తామని ఒక జపాన్ అభిమాని వివరించినట్లు వీడియోలో కనిపించింది.
మ్యాచ్‌లో జపాన్ రెండుసార్లు వెనుకబడినా తిరిగి పోరాడింది. రెండో అర్ధభాగంలో విర్జిల్ వాన్ డైక్ గోల్‌తో నెదర్లాండ్స్ ముందంజలో నిలిచింది. కైటో నకమురా సమం చేశాడు. 64వ నిమిషంలో క్రైసెన్సియో సమ్మర్విల్ మరోసారి డచ్ జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే 88వ నిమిషంలో కోకి ఒగావా కార్నర్‌ను డైచి కమాడా గోల్‌గా మలిచి జపాన్‌కు కీలక డ్రా అందించాడు. జపాన్ అభిమానుల ఈ సంప్రదాయం 1998 ప్రపంచకప్ నుంచి కొనసాగుతోంది.
అప్పటి నుంచి ప్రపంచకప్‌లు, ఒలింపిక్స్ వంటి పెద్ద టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియాలను శుభ్రం చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా మైదానంలో జట్టు పోరాటం ఎంత ఆకట్టుకుందో, స్టాండ్లలో అభిమానుల సంస్కారం అంతే ప్రశంసలు అందుకుంది.

