Mobile Popup Ad
Mobile Popup Ad

దివ్యాంగులకు జాలి కాదు.. సమాన అవకాశాలు కల్పిస్తాం: సీతక్క

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని మంత్రి సీతక్క (Seethakka) వ్యాఖ్యానించారు. దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన దివ్యాంగ మహిళ హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను ప్రారంభించి మాట్లాడారు. హెలెన్ కెల్లర్ (Helen Keller) జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అని కొనియాడారు. చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా సంకల్పబలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.

ఆమె చెప్పిన “ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలం… కలిసి ఉంటే ఎంతో సాధించగలం” అనే సందేశం ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగులకు జాలి కాదు… గౌరవం, సమాన అవకాశాలు, ఆదరణ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అదే హెలెన్ కెల్లర్‌కు మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

13 వేలకుపైగా దివ్యాంగ సంఘాలు..

సీఎం రేవంత్ నాయకత్వంలో దివ్యాంగులకు విద్య, ఉపాధి, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. గత రెండు దశాబ్దాలుగా మహిళల సాధికారత కోసం విశేషంగా పనిచేస్తున్న సెర్ప్‌కు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ బాధ్యతలను కూడా అప్పగించిందన్నారు. మహిళా సంఘ సభ్యుల దివ్యాంగ పిల్లలకు ఈ లోటు రాకుండా చూసుకునే బాధ్యత అప్పగించామని చెప్పారు.

సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, డైరెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తక్కువ కాలంలోనే దివ్యాంగులను సంఘటితం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకుపైగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రస్తుతం 82 వేల మందికి పైగా సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారని తెలిపారు.

2,248 మందికి జీవనోపాధి అవకాశాలు..

దివ్యాంగులకు స్త్రీనిధి ద్వారా రూ.38.16 కోట్ల రుణాలు, గ్రామ మహిళా సంఘాల ద్వారా రూ.4.13 కోట్ల రుణాలు, రూ.11.62 కోట్ల పొదుపులు, 2,248 మందికి జీవనోపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి దివ్యాంగుడికి సేవలు వారి ఇంటి సమీపంలోనే అందేలా నైబర్‌హుడ్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సెర్ప్‌లో దివ్యాంగుల సంక్షేమ విభాగ డైరెక్టర్ ఎల్ కృష్ణమూర్తి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పీయూష్ మిట్టల్, కైలాష్, అధికారులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>