కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ అక్రమాల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా కేంద్రంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగిన మానేరు ఇసుక దందా (Sand Mining Scam)పై అధికార యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలోకి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) రంగంలోకి దిగడంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర అలజడి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, వందల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు మైనింగ్ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో సాగిన ఇసుక మాఫియా కారణంగా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు మైనింగ్ శాఖ నిర్ధారించింది. గత ప్రభుత్వ హయాంలో రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రతిరోజూ సుమారు 800 టిప్పర్ల ఇసుకను హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించినట్లు సమాచారం. స్కెచ్ ప్రకారం దోపిడీ ఇలా సాగింది. ఒకే ఒక అనుమతి పత్రాన్ని (పర్మిట్) ఉపయోగించి నాలుగు సార్లు ఇసుకను లోడ్ చేసి తరలించారు.
నకిలీ బిల్లుల సృష్టి
రవాణా సాఫీగా సాగేందుకు నకిలీ వే-బిల్లులను సృష్టించి అధికారులను బురిడీ కొట్టించారు. జీపీఎస్, ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా వాహనాలు నడిపారు. నిబంధనల ప్రకారం కేవలం 3 మీటర్ల లోతు వరకే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నా, భారీ యంత్రాలతో ఏకంగా 25 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వేశారు. దీని వల్ల భూగర్భ జలాలు పడిపోయి పలు గ్రామాల్లో బావులు ఎండిపోయినట్లు గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), కాగ్ తమ నివేదికల్లో ఎండగట్టాయి. అయితే ఈ ఇసుక మాఫియా వెనుక ఉన్న పొలిటికల్ హ్యాండ్స్ ఎవరు అనేదానిపై ఇప్పుడు సీఐడీ దృష్టి సారించింది. ఈ అక్రమాల వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ వ్యూహకర్త అయిన మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు పాత్రపై ఇప్పుడు గట్టిగా ఉచ్చు బిగుస్తోంది. ఇసుక మాఫియాకు బలమైన రాజకీయ అండదండలు ఉండటం వల్లే ఆనాడు అంతటి దారుణాలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి.
నేరేళ్ల ఉదంతం తెరపైకి
ఈ ఇసుక దందా వల్ల గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేళ్ల ఘటనను రాజకీయ వర్గాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించిన నేరేళ్ల గ్రామస్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఇసుక వ్యవహారం కారణంగా అప్పట్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరిసిల్ల నియోజకవర్గంలో సాగిన ఇసుక అక్రమాలు, నేరేళ్ల ఘటన స్థానికంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి, ఇది కేటీఆర్ ఇమేజ్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం 2014 నుంచి 2026 వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, మైనింగ్ శాఖ తన ప్రాథమిక నివేదికను సీఐడీకి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా సూత్రధారులు, పాత్రధారుల జాబితాను సీఐడీ సిద్ధం చేస్తోంది. విచారణ మరింత ముమ్మరమైతే మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని, ఇది తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

