కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) కీలక సూచనలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు డిసెంబర్ 18వ తేదీలోగా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలని సూచించారు. వివరాలు సమర్పించని వారు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరని హెచ్చరించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ ఎలాంటి ఖర్చు చేయకపోతే నిల్ అని సమర్పించాలని సూచించారు.
నామినేషన్లు దాఖలు చేసినప్పటి నుంచి ప్రచార ఖర్చుకు సంబంధించి ప్రతి బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలని వివరించారు. అభ్యర్థులు స్థానిక రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల సైతం ఖర్చుల వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. లేకపోతే పదవులు కోల్పోవడమే కాకుండా.. భవిష్యత్తులో పోటీ చేసే అవకాశాలను కోల్పోతారని చెప్పారు.

