కలం, వెబ్ డెస్క్: ఏపీలోని నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొని ప్రసంగించారు. ‘బోటు మనదే.. వేట మనదే’ అనే నినాదంతో మత్స్యకారులను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన రాష్ట్ర తీరంపై మనకే సర్వహక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల బోట్లు మన పరిధిలోకి వస్తే శాటిలైట్ సాంకేతికత ద్వారా గుర్తించి, వెంటనే వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు. అలాగే, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జువ్వలదిన్నె హార్బర్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ, వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే సాయాన్ని రూ. 20 వేలకు పెంచుతామని చంద్రబాబు వెల్లడించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, వారిని పూర్తిగా విస్మరించిందని సీఎం విమర్శించారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం తానే స్వయంగా చేపల ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌గా వ్యవహరిస్తానని భరోసా ఇచ్చారు. చేపలు ఆరోగ్యానికి మంచి ఆహారమని, వీటిని క్రమం తప్పకుండా తింటే వ్యాధులు రావని ఆయన పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతను జోడించి, సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Read Also: దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్!
Follow Us On: WhatsApp

