Mobile Popup Ad
Mobile Popup Ad

చెన్నైలో సంజూ సునామీ సెంచరీ.. టోర్నీలో ఇదే ఫస్ట్..

కలం, స్పోర్ట్స్ : ‘వరల్డ్ కప్ తర్వాత సంజూ (Sanju Samson) చతికిలబడ్డాడు. ఏదో లక్ బాగుండి వరల్డ్ కప్‌లో ఆడాడు. నిజంగా ఆటగాడు అయితే.. ఐపీఎల్‌లో ఎందుకు ఆడట్లేదు’ ఇలాంటి విమర్శలన్నింటికీ తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు సంజూ శాంసన్ (Sanju Samson). ఐపీఎల్ 2026లో తొలి సెంచరీని తన పేరుపై నమోదు చేశాడు. విమర్శల తుపాను ముంచుకొస్తున్న వేళ.. బ్యాట్‌తోనే జవాబివ్వడం సంజూ శాంసన్‌కు అలవాటే. వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోల్పోయాడంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోల్స్‌కు చెన్నై చెపాక్ స్టేడియం సాక్షిగా సంజూ తనదైన శైలిలో ‘ఫుల్‌స్టాప్’ పెట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేసి, గ్రౌండ్‌లో క్లాస్ విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ.. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం తడబడకుండా, కేవలం 52 బంతుల్లోనే 102 పరుగులతో అజేయంగా నిలిచి తన సత్తా చాటాడు.

సంజూ ఇన్నింగ్స్ ఒక పక్కా ప్లానింగ్‌తో సాగింది. 196.15 స్ట్రైక్ రేట్‌తో సాగిన అతని ఇన్నింగ్స్‌లో 14 మెరుపు ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి మేటి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూ చూపిన తెగువ అభిమానులను ఉర్రూతలూగించింది. రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే నిష్క్రమించినా, యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే (59)తో కలిసి సంజూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 17.3 ఓవర్ల వద్ద ఆయుష్ అవుట్ అయ్యే సమయానికి స్కోరును 175 పరుగులకు చేర్చిన సంజూ, చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

ఈ సెంచరీ సంజూ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. వరల్డ్ కప్ సక్సెస్ కేవలం అదృష్టం కాదని, అది తన కష్టార్జితమని ఈ ఇన్నింగ్స్‌తో శాంసన్ నిరూపించాడు. టీ నటరాజన్, ముఖేష్ కుమార్ వంటి పేసర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో బెంబేలెత్తించిన తీరు చూస్తుంటే, పాత సంజూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఐపీఎల్ 2026లో మొదటి సెంచరీ వీరుడిగా నిలిచిన సంజూ, ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా తన ఉనికిని బలంగా చాటుకున్నాడు. ఇన్నాళ్లూ తనపై వస్తున్న విమర్శలను ఒక్క సెంచరీతో చెరిపేసి, తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>