కలం, కొత్తగూడెం : ఇసుక మాఫియాల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమ సంపాదనే లక్ష్యంగా దొంగదారిన ఇసుక అమ్ముకుంటూ రెచ్చిపోతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్న వారిపై దాడులు చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నందుకు ప్రశ్నించిన సర్పంచ్ భర్తపైనే ట్రాక్టర్ డ్రైవర్ దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. అక్రమ ఇసుక రవాణా నేపథ్యంలో జరిగిన దాడి చట్టాన్ని సవాలు చేస్తూ.. అధికార వ్యవస్థను ఎగతాళి చేసేలా ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. సర్పంచ్ భర్త వెంకటేష్‌ను బెదిరించడమే కాకుండా దారుణంగా కొట్టడంతో, ఇసుక మాఫియా పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార వ్యవస్థకు ఇసుక మాఫియా సవాల్
’మేము పోలీసులకు మామూళ్లు ఇస్తున్నాం.. ఎవరూ ఏం చేయలేరు. మా వ్యాపారానికి అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తాం‘ అంటూ ట్రాక్టర్ యజమాని తమను బెదిరించాడని సర్పంచ్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ దాడి ఘటనలో సర్పంచ్ స్వప్నకు, ఆమె భర్త వెంకటేష్‌కు గాయాలు కావడంతో గ్రామంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇది కేవలం ఒక దాడి ఘటన మాత్రమే కాదు.. అధికార వ్యవస్థకు సవాల్ విసురుతున్న ఇసుక మాఫియా ధైర్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకే ఇలాంటి బెదిరింపులు వస్తే, సాధారణ ప్రజల భద్రత ఎక్కడిది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ’మామూళ్లు ఇస్తున్నామంటూ బహిరంగంగా చెప్పే స్థాయికి మాఫియా చేరితే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి‘ అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న మాటలు కేవలం పుస్తకాలకే పరిమితమా? లేక నిజంగా అమలు అవుతాయా..? ఇప్పుడు అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. గతంలో కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న కొందరిని పోలీసులకు అప్పగించిన సర్పంచ్ స్వప్న, ఈసారి కూడా అదే ధైర్యంతో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడికి గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ స్వప్న, భర్త వెంకటేష్.. వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుల ఆరోపణల ప్రకారం ప్రారంభంలో పోలీసుల స్పందన ఆలస్యంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు “మామూళ్ల” వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు నియోజకవర్గం (Palwancha)తో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దళాలతో దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.

