మొన్న సర్పంచ్.. నిన్న ఉప సర్పంచ్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో ఇసుక మాఫియా (Sand Mafia) ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రుళ్లు అక్రమ ఇసుక రవాణా చేపడుతూ, ప్రశ్నించిన వారిపై దాడుల(Attacks)కు పాల్పడుతున్న సంఘటనలు జిల్లాలో అనేకంగా చోటు చేసుకోవడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఇటీవల పాల్వంచ మండలం నాగారం గ్రామ పంచాయతీలో జరిగిన దాడి ఘటన సంచలనం రేపింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న మహిళా సర్పంచ్ స్వప్నపై ట్రాక్టర్ యజమాని దాడి చేశాడు. అంతే కాకుండా ఆమె భర్త వెంకటేష్‌ను బెదిరించడమే కాకుండా దారుణంగా కొట్టారు. ఈ దాడి ఘటనలో సర్పంచ్ స్వప్న, ఆమె భర్త వెంకటేష్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

తాజాగా బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న సారపాక ఉప సర్పంచ్ కె.ప్రసాద్‌పై మాఫియా దాడికి యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో సారపాక బ్రిడ్జి కింద నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న ఉప సర్పంచ్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు ఆయనపై దాడికి ప్రయత్నించగా.. ఉపసర్పంచ్ పోలీసులకు ఫోన్ చేశారు. అయితే ఒకరు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారని, మరొకరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కేవలం ఒక దాడి ఘటన మాత్రమే కాదని, ఇసుక మాఫియా ధైర్యానికి నిదర్శనమని స్థానికులు అంటున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా మేము పని చేయాలా వద్దా? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల సహకారం లేకుండా ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టలేమన్నారు. కాబట్టి పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక మాఫియా చర్యలకు అడ్డుకట్ట వేసి సహజ సంపదను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>