కలం, మహబూబ్నగర్ బ్యూరో: మిడ్జిల్ మండలం కొత్తపల్లి (Kothapalle) గ్రామం సర్వే నంబర్ 96లో గతంలో జప్తు చేసిన ఇసుకను లెవెల్ చేసి మట్టితో కప్పిన ఘటనపై శనివారం విచారణ నిర్వహించినట్లు గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులు ఎం. హరికృష్ణ తెలిపారు. వివిధ వార్తా దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో ఈ నెల 19న రెవెన్యూ, గనులు, భూగర్భ శాఖలకు చెందిన అధికారులు సర్వే నంబర్ 96లో జప్తు చేసిన ఇసుక నిల్వ ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా జప్తు చేసిన ఇసుకను లెవెల్ చేసి, దానిపై మట్టిని కప్పినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నెల 20 న నిర్వహించాల్సిన ఇసుక వేలం ప్రక్రియకు ముందు ఈ విధంగా చేయడం జరిగినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై అధికారులు పంచనామా నిర్వహించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించినట్లు హరికృష్ణ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఇసుక తవ్వకాల నిబంధనలు–2015 ప్రకారం సంబంధిత పట్టాదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణలు స్వీకరించిన అనంతరం, నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

