కలం, నాగర్ కర్నూల్: ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ (Pothuganti Bharath Prasad) సూచించారు. భరత్ ప్రసాద్ శనివారం నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి (Nagarkurnool Govt Hospitals)ని సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య విద్యార్థులు, వైద్యులు, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. వైద్య విద్యార్థుల శిక్షణ, విధుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.
ప్రతి రోగికి మెరుగైన వైద్యం, అవసరమైన శ్రద్ధతో కూడిన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతతో పని చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం, మెరుగైన సౌకర్యాలు అందేలా నిరంతరం కృషి చేయాలని కోరారు.

