కలం వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్లు, గంజాయి బాబుల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Sajjanar) ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లను కలిసి వారితో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని, వ్యసనం నుంచి బయటపడటానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. 239 మంది రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా.. వారిలో 188 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 35 మంది గాంధీ డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారని, మిగతా వారికి ఇతర కేంద్రాల్లో కౌన్సెలింగ్, చికిత్స ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రతిపాదనలతో రాష్ట్రవ్యాప్తంగా 35 డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు కావడం దేశానికే ఆదర్శమని, ఇది తెలంగాణ ప్రభుత్వ చారిత్రక నిర్ణయం అని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని డీ-అడిక్షన్ కేంద్రాలు లేవన్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు, ముఖ్యంగా యువతకు కచ్చితంగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒక వైపు బాధితులను వ్యసనం నుంచి విముక్తులను చేస్తూనే, మరో వైపు డ్రగ్స్ విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

