కలం, వెబ్ డెస్క్: ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖరన్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ ఈ కేసులో ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)ను నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా జాక్వెలిన్ ఈ కేసులో అప్రూవర్‌గా మారతానని ప్రకటించింది. ముందుగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలని జాక్వెలిన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే అప్రూవర్‌గా మారడానికి అనుమతివ్వాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. అయితే నిబంధనల ప్రకారం అప్రూవర్‌గా మారాలంటే ముందు ఈడీని సంప్రదించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సుఖేశ్ చంద్రశేఖరన్ మనీ లాండరింగ్ చేసిన సొమ్ముతో అత్యంత ఖరీదైన బ్యాగులు, జిమ్ సూట్లు, వజ్రాల చెవి పోగులు, బ్రాస్‌లెట్లు, మినీ కూపర్, కొన్ని జంతువులు.. ఇలా దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులను జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఇచ్చాడు. అవి మనీ లాండరింగ్ సొమ్ముతో కొనుగోలు చేసినవి అని తెలిసినా జాక్వెలిన్ వాటిని తీసుకుంది. దీంతో సుఖేశ్ పట్టుబడ్డ కొన్ని రోజులకే జాక్వెలిన్ కూడా ఈ కేసులో ఇరుక్కుంది.

