ప్రాజెక్టుల్లో వ్యయాలపై కీలక కమిటీ ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల్లో అంచన వ్యయాలు నిరంతరం పెరుగుతుండటంపై సమీక్ష చేసింది. అంచనా వ్యయం, ఖర్చవుతున్న వ్యయానికి ఏమాత్రం పొంతన ఉండటం లేదని గుర్తించింది. నిధులు విడుదలవుతున్నా.. పనులు కావడం లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కమిటీ పని ఇదే..

ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశ నుంచి భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు విధివిధానాల కోసం యూనిఫైడ్ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. సీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న కమిటీ ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ వరకు అన్ని దశలను పరిశీలించాలని ఆదేశించింది.

ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త..

ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో కో–ఆప్షన్స్ సభ్యులు అయిదుగురు ఉండగా.. అదనంగా ట్రాన్స్‌జెండర్‌ని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

శంషాబాద్‌లో రైల్ హబ్ ఏర్పాటు..

హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల ఏర్పాటు గురించి రోడ్లు, భవనాల శాఖ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్, పుణె, ముంబయికి ఒక రూట్, హైదరాబాద్, బెంగుళూరు మరో రూట్, హైదరాబాద్, అమరావతి, తిరుపతి, చెన్నై మరో రూట్ బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేబినెట్ పేర్కొంది.

చిన్న కాళేశ్వరానికి గ్రీన్ సిగ్నల్..

మంథని నియోజకవర్గంలోని ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ పథకం పూర్తి చేయనుంది. ఇప్పటికే పూర్తయిన పనులను అంచనా వేసుకొని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>