కలం, వెబ్ డెస్క్ : మోదీ సర్కార్ రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ (Delimitation) బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచడం, నియోజకవర్గాల సరిహద్దులను సవరించే డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ పూర్తి మద్ధతు ఉంటుందని ప్రకటించారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రాతినిధ్యం ఉండడం ప్రజాస్వామ్యబద్ధమని, కేంద్రం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను, ఆందోళలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని సజ్జల అన్నారు. ప్రజల అభ్యంతరాలను తొలగించి పారదర్శకంగా పునర్విభజన ప్రక్రియ కొనసాగాలని కోరారు.
కాగా, డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లు ఉండగా వాటిని 850కు పెంచాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఎంపీలకు కూడా జారీ చేసింది. ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకే జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ ఉండనుంది. లోక్ సభలో పెరగనున్న 850 సీట్లలో 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండనున్నట్లు కేంద్రం వివరించింది. అయితే డీలిమిటేషన్ వల్ల జనాభా తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలలోని నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర తీసుకున్న నిర్ణయానికి వైసీపీ మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.

