సాయికృష్ణ కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : సాయికృష్ణ కేసు (Sai Krishna Case)లో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ లాకప్‌డెత్ కేసు విచారణను తామే స్వయంగా చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించడమే కాకుండా, హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. తమ విచారణ పూర్తయ్యేంత వరకు హైకోర్టులో ఎలాంటి విచారణ కొనసాగించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

పోలీసు కస్టడీలో ఉన్న సాయికృష్ణ మాయం కావడం పూర్తిగా చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సాయికృష్ణ తల్లి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించింది. ఏపీ డీజీపీ నిద్రపోతున్నారా అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సీసీ టీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేస్తుంటే ఏసీపీ ఏం చేస్తున్నారని, పోలీసులు తమ విధి నిర్వహణను మరిచిపోయారా అని మండిపడింది.

ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసేవరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 30 నాటికి సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>