కలం, వెబ్‌డెస్క్: స్థానిక చట్టాలను పాటించడం లేదంటూ వాట్సాప్‌ను రష్యా బ్లాక్ చేసింది (Russia Blocks Whatsapp). దీనికి బదులు తమ దేశ సొంత మెసేజింగ్ యాప్ అయిన మాక్స్ (MAX)ను వాడాలని పౌరులకు సూచించింది. ఈ మేరకు రష్యా నిర్ణయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం ధ్రువీకరించారు. రష్యా చట్టాలను వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా పాటించడం లేదని తేలినందుకే ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి బదులు రష్యా సొంత తయారీ మెసేజింగ్ యాప్ అయిన మాక్స్‌ను (Max App) వాడాలని తమ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యాకు వ్యతిరేక సమాచారాన్ని మెటా తన ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ ద్వారా ప్రచారం చేస్తోందని రష్యా భావిస్తోంది. ముఖ్యంగా వాట్సాప్‌ను వాడుకొని తమ వ్యక్తిగత, దేశ భద్రత విషయాలను సేకరిస్తోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆర్నెళ్ల నుంచి మెటాపై తీవ్ర ఒత్తిడి చేస్తోంది. మెటా (Meta) స్పందించకపోవడంతో వాట్సాప్‌ను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది (Russia Blocks Whatsapp). దీంతో వాట్సాప్‌కు అనుబంధంగా ఉన్న లింక్‌లు ప్రస్తుతం రష్యాలో అదృశ్యమయ్యాయి.
మరోవైపు మెటా మీద ఇటీవల భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారతీయ చట్టాలను గౌరవిస్తూ, ప్రజల గోప్యతను పాటించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలూ జారీ చేశాయి. వాట్సాప్‌లో సమాచారం మెటాలోకి షేర్ అవుతోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ వార్నింగ్ ఇచ్చాయి. అంతేకాదు, భారత చట్టాలను పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఇదే అంశాలను చూపుతూ వాట్సాప్‌ను రష్యా బ్లాక్ చేయడం గమనార్హం.
Read Also: బాబోయ్.. భయపెట్టిన భారీ సింక్ హోల్!
Follow Us On: Instagram


