కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వయలెన్స్ సాంగ్‌పై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) రియాక్ట్ అయ్యారు. ‘ఇది చూసేందుకే భయంకరంగా ఉంది. మానవత్వాన్ని కించపరిచడంతో పాటు సొసైటీలో హింస సాధారణమే అని చూపించేలా ఉంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో గ్యాంగుల హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పాటలు రావడం పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదు. డీజీపీ వెంటనే స్పందించి, ఈ పాటను చిత్రీకరించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని జైల్లో పెట్టి బయటకు రాకుండా చూడాలి. అలాగే, హింసను అదే పనిగా ప్రోత్సహిస్తున్న మూవీ డైరెక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని అని డిమాండ్ చేశారు.
వీడియో మొత్తం కత్తులే..
‘గెలికి చూడు తమ్ముడు’ అంటూ సాగే ఈ పాటను దాసరి సుహాజ్ అనే యువకుడు రాసి చిత్రీకరించినట్లుగా వీడియోలో స్పష్టమవుతోంది. తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తూ.. కత్తులు, డమ్మీ తుపాకులు పట్టుకుని కొందరు యువకులతో వివిధ లోకేషన్లలో షూట్ చేసినట్లుగా అర్థమవుతోంది. తన జోలికి వస్తే నడి వీధిలో చంపడం ఖాయమమని, ఎవరికి భయపడబోనని అందులో వార్నింగ్ కూడా ఇచ్చాడు. పాట మొత్తం బూతు పదాలు, హింసను ప్రేరేపించేలా ఉండటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా, హింస కలిగించేలా ఉందని పోస్టులు పెడుతున్నారు. వీడియోలో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లు ఎవరినీ టార్గెట్ చేశారో ముందుగానే గుర్తించాలని సూచిస్తున్నారు. దీనిపై ఇంకా పోలీస్ శాఖ స్పందించలేదు.

