కలం, నల్లగొండ: మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కీచకుడికి నల్లగొండ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (Nalgonda POCSO Court) కఠిన శిక్ష విధించింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరదించుతూ.. నిందితుడు షేక్ సయ్యద్ భాషాకు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. అలాగే, బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ప్రకటించింది.
పోలీసుల కథనం ప్రకారం.. 2018లో వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దామరచర్ల ప్రాంతంలో నిందితుడు షేక్ సయ్యద్ ఓ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలి తల్లి వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. 2018 నుంచి ఈ కేసుపై పోక్సో న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. విచారణ సమయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ నిందితుడి నేరాన్ని నిరూపిస్తూ బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను, వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తుది తీర్పు చెప్పారు.
ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్, న్యాయ సిబ్బందిని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ యు. నగేష్, దర్యాప్తు అధికారులు (ఐఓలు) పి. శ్రీనివాస్, వై.వెంకటేశ్వరరావులతో పాటు ప్రస్తుత ఎస్హెచ్ఓ ధర్మా, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్రసాద్, సీడీఓ అదనాన్, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితరుల సేవలను ఎస్పీ కొనియాడారు.

