కలం, ఖమ్మం బ్యూరో: న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 35 కేసులకు సంబంధించిన భారీ మొత్తపు మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు బుధవారం తెలిపారు.
తల్లాడ (Thallada) మండలం గోపాలపేట గ్రామంలోని ఎం/ఎస్ ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ ప్రాంగణంలో అక్టోబర్ 27న ఈ మాదకద్రవ్యాల నిర్వీర్య ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 35 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 982 కిలోల 562 గ్రాముల మాదకద్రవ్యాలను దహనం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో 977 కిలోల 816 గ్రాముల గంజాయి, 4 కిలోల 746 గ్రాముల హషీష్ ఆయిల్ ఉన్నాయని, వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 4 కోట్ల 91 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియలో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతీఒక్కరి సామాజిక బాధ్యత
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా, వారి కుటుంబాల ఆశలను సైతం దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని ప్రోత్సహించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు, సీఐ కరుణాకర్, ఆర్ఐ నరసింహారావు, ఎస్ఐ హారిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

