మద్యం ఆశ చూపి దారుణం.. లక్ష్మీదేవిపల్లి హత్య కేసు మిస్టరీ వీడింది!

​కలం, ఖమ్మం బ్యూరో : “మద్యం తాగిస్తామని నమ్మించి.. ఎదురుగడ్డ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు.. కత్తితో గొంతు కోసి, సిమెంట్ ఇటుకలతో ముఖంపై చితకబాది కిరాతకంగా హత్య చేశారు” అని  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మేడి అఖిల్ హత్య కేసు విచారణలో వెల్లడైంది. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యను పోలీసులు సాంకేతిక ఆధారాలతో అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ బుధవారం మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

​లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ (Edurugadda) గ్రామానికి చెందిన మేడి అఖిల్‌పై, గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల కారణంగా ప్రధాన నిందితులు దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అఖిల్‌ను అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న తెల్లవారుజామున సుమారు 3:00 గంటల ప్రాంతంలో మద్యం తాగిస్తామని అఖిల్‌ను నమ్మించి ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు.

అక్కడ పథకం ప్రకారం గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడవగా, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేశాడు. మరో నిందితుడు సాత్విక్ కూడా సిమెంట్ ఇటుకతో తీవ్రంగా దాడి చేయడంతో అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్ ముందస్తుగా సహకరించినట్లు, మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

​జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలు, ఫోన్‌పే లావాదేవీల స్క్రీన్‌షాట్లు, కాల్ డేటాను లోతుగా విశ్లేషించారు. నిందితులు పరారీలో ఉన్నప్పటికీ, విశ్వాసనీయ సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్‌స్టాండ్ సమీపంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

​వ్యక్తిగత కక్షలు, పాత గొడవల కారణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హింసాత్మక చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకొని నేరాల బాట పట్టవద్దని, సమస్యలు వస్తే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. నిందితులు ఎంతకాలం తలదాచుకున్నా సాంకేతికత సహాయంతో గుర్తించి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును వేగంగా, సమర్థవంతంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, టెక్నికల్ టీమ్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Also Read : స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>