కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద మంజీర నది (Manjeera River)లో నిన్న సాయంత్రం ఇద్దరు చిన్నారులతో కలిసి ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆత్మహత్యకు ముందు తన తండ్రి బాలకృష్ణయ్యకు ఫోన్ చేసింది. తాము చనిపోతున్నామని తండ్రితో చెప్పిన కొద్దిసేపటికే, ఇద్దరు కుమార్తెలతో కలిసి మంజీర నది నీటిలోకి దూకేసింది.
తండ్రి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బోట్ల సహాయంతో నదిలో గల్లంతైన వారి కోసం నిన్న సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, సమయం మించిపోవడం, చీకటి పడటంతో మంగళవారం రాత్రికి గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరిగి బోట్ల సహాయంతో గాలింపు చర్యలలో ముగ్గురు మృతదేహాలు లభించాయి.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (25) భర్త మరణించాడు. దీంతో ఆమె పొట్టకూటి కోసం హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆధార్ కార్డులలో సవరణల కోసం తన ఇద్దరు కుమార్తెలు వైష్ణవి, శ్రావణిలతో కలిసి మెదక్‌లోని అక్క ఇంటికి వచ్చింది. పిల్లలతో కలిసి ఏడుపాయల క్షేత్రానికి వెళ్లిన సరిత, జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

