కలం, కరీంనగర్ : దళితుల సమస్యల పరిష్కారమే దీనబంధు దర్బార్ (Dinabandhu Darbar) ప్రధాన లక్ష్యమని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో దీనబంధు దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. దళితులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ముఖ్యంగా భూ సమస్యలు చాలావరకు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. దళితులకు చెందిన వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని, లిడ్‌క్యాప్ భూముల ఉదంతమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
దీనబంధు దర్బార్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ దళితుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దళిత జాతికి సేవ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు కల్పించారని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు దీనబంధు దర్బార్‌ను వేదికగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్లోని అంశాలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

