కలం, వెబ్ డెస్క్ : మంగళగిరిలో నిర్వహించిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 3,000 మంది నిరుపేద కుటుంబాలకు ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు పసుపుకుంకుమ, పట్టుచీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో మంత్రి లోకేష్ సరదాగా ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తాను ఏదైనా తప్పు చేస్తే తన తల్లి భువనేశ్వరి కొట్టేవారని, ఇప్పటికీ పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడేటప్పుడు ఒక్క మాట తేడా వచ్చినా సాయంత్రానికి ఫోన్ చేసి తిడుతుంటారని నవ్వుతూ చెప్పారు.
ఇదే వేదికపై తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును లోకేష్ కొనియాడారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుకుగా పనిచేస్తున్నారని, ఒక్క రోజు కూడా జ్వరంతో ఇంట్లో విశ్రాంతి తీసుకున్న సందర్భం తనకు గుర్తులేదని అన్నారు. ‘కష్టపడాలిరా’ అంటూ చంద్రబాబు ఎప్పుడూ తమను ప్రోత్సహిస్తుంటారని, ఆయనలో అలసటను తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరం కలిసి 62 ఏళ్లు కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, ఆ తర్వాత మనది కాదని కట్టుబట్టలతో బయటకు పంపించేశారని గుర్తుచేశారు. ఆ కసితోనే ఇప్పుడు అమరావతిని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

