కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక (Sarapaka)లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజీవ్‌నగర్‌లోని సాయిబాబా గుడి వీధిలో కోర్టు పరిధిలో ఉన్న దారి వివాదంపై ఇద్దరు మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు. గంజి నాగమణి, బీహార్‌కు చెందిన రాధా సింగ్ మధ్య దారి విషయమై తొలుత మాటల యుద్ధం జరిగి.. చివరికి పెద్ద గొడవకు దారితీసింది. ఈ క్రమంలో రాధా సింగ్, ఆమె భర్త ఘనశ్యామ్ సింగ్.. తనపై రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని నాగమణి ఆరోపించారు.
తనను కొట్టడమే కాకుండా, మెడలోని అయిదు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి మహిళపై దాడి ఘటనపై సీపీఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితురాలికి మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

