Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ రహదారులు రక్తసిక్తం.. 75 రోజుల్లో 72 మంది మృతి

కలం, నల్లగొండ బ్యూరో: ‘అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు..?’ అంటూ ఎదురుచూసిన పసిపాప.. తన తండ్రి రోడ్డు ప్రమాదం (Road Accidents)లో చనిపోయి ఇంకెప్పుడూ ఇంటికి రాలేడని తెలుసుకోలేకపోతోంది. రోజువారీలాగే పిల్లలకు పాఠాలు చెప్పేందుకు వెళ్లిన ఓ టీచర్.. మార్గమధ్యలో తనువు చాలించింది. బీహార్ నుంచి వలసొచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ.. పక్క ఊరికెళ్లి సరుకులు తెచ్చేందుకు వెళ్లిన తండ్రిని లారీ మృత్యురూపంలో పొట్టనపెట్టుకుంది. తమ కోసం తినేందుకు ఏమైనా తెస్తాడని ఆశగా ఎదురుచూస్తోన్న ఆ పసిహృదయాలకు తెలియదు కదా.. తన తండ్రి మళ్లీ కన్పించడని.. ఇలా ఒక్కో రోడ్డు ప్రమాదం వెనుక ఒక్కో కన్నీటి గాథ. ఒకటీ కాదు, రెండు కాదు.. దాదాపు 72 మంది కుటుంబాల ఆక్రందన.. ఆవేదన.. మాటల్లో చెప్పలేని వర్ణనాతీతం. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కేవలం గత 75 రోజుల వ్యవధిలో ఏకంగా 180కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 72 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 210 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలిపోవడం గమనార్హం.

చితికిపోతున్న కుటుంబాలు

వాస్తవానికి రోడ్డు ప్రమాదం అంటే.. కేవలం ప్రాణం కోల్పోవడం కాదు.. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డునపడటం. ఇంటి పెద్ద దిక్కునో.. కుటుంబ సభ్యుడినో కోల్పోయిన వారి ఆవేదన అంతాఇంతా కాదు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనవరి నుంచి మార్చి 16 వరకు అంటే కేవలం 75 రోజుల్లో 72 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మాటలు కాదు. సగటున రోజుకు ఒక్కో ప్రాణం గాలిలో కలిసిపోతోంది. నిన్న చింతపల్లిలో (Chintapally) ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మరణిస్తే.. మరో ప్రమాదంలో నిడమనూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబాలు.. చేతికందిన కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఆక్రందనలు.. నేషనల్ రైడర్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి వలిగొండ (Valigonda) మండలం అరూరులో చనిపోవడం.. ఇలా ఒక్కో ఘటనలో అంతుచిక్కని ఆవేదన ఎంతో ఉంది.

రహదారులు పెరిగినా.. ఆగని యాక్సిడెంట్లు

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఒకప్పటితో పోల్చితే.. రహదారుల విస్తరణ పెరిగిపోయింది. ఉమ్మడి జిల్లా మీదుగానే హైదరాబాద్- విజయవాడ (Hyderabad-Vijayawada) నేషనల్ హైవే, నార్కట్‌పల్లి- అద్దంకి హైవే, నకిరేకల్- మాచర్ల, నకిరేకల్ టూ మల్లంపల్లి, చిట్యాల టు భువనగిరి, హైదరాబాద్- నాగార్జునసాగర్, కోదాడ- జడ్చర్ల, సూర్యాపేట, జనగామ తదితర రహదారులపైనే ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులు విశాలంగా ఉండడం.. స్పీడ్ ఎక్కువగా వెళ్లేందుకు అవకాశం ఉండడంతో వాహనదారులు అతివేగంగా వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. 75 రోజుల్లో జరిగిన మెజార్టీ రోడ్డు ప్రమాదాల్లో అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. రహదారుల నిర్మాణంలో లోపాలతోపాటు వాహనదారుల తప్పిదాలు కోకొల్లలు. మరోవైపు నల్లగొండ పట్టణంలోని వివేకానంద స్టాచ్యూ, ప్రసాద్ ఉడిపి హోటల్, ఎన్‌జీ కాలేజీ, బస్టాండ్ సమీపంలోని రెడ్ క్రాస్ ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలకు కూడళ్ల సుందరీకరణ పేరుతో ఏర్పాటుచేసిన పనులే కారణమనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించడమే కాదు.. రహదారుల నిర్మాణంలోనూ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. సర్‌ప్రైజ్ టూర్‌తో సస్పెన్స్?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>