కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కంది మండలం కాశింపూర్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పల్టీలు కొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని గాజులగూడకు చెందిన నర్సింహులు (40), ఆయన భార్య మౌనిక (30) కారులో సంగారెడ్డికి బయలుదేరారు. కాశింపూర్ సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను దాటి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
అనంతరం కారు పల్టీలు కొట్టడంతో తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న నర్సింహులు, మౌనిక అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

