కలం, తెలంగాణ బ్యూరో: ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు (Telangana Global Summit) రావాల్సిందిగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ‘రక్షా ఎక్స్ పో’ పేరుతో ఎయిర్ స్పేస్, డిఫెన్స్, ఎయిర్ షో ప్రదర్శనలు ఉంటున్నందున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వస్తానంటూ స్వయంగా సీఎం రేవంత్ కు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతేడాది తరహాలోనే ఈసారి కూడా హాజరు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇక కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అటెండ్ అయ్యే అవకాశాలున్నాయి. వీరికి తోడు అన్ని రాష్ట్రాల సీఎంలను సైతం ఈ సమ్మిట్‌కు తెలంగాణ ఆహ్వానిస్తున్నది. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు తదితరులు పలు రాష్ట్రాలకు వెళ్లి సీఎంలకు ఇన్విటేషన్లు ఇవ్వనున్నారు. గతేడాది సమ్మిట్‌కు కర్నాటక నుంచి అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ మాత్రమే హాజరుకాగా ఈసారి సీఎం హోదాలో ఆయనతో పాటు కేరళం, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు హాజరయ్యే అవకాశమున్నది.
‘కర్టెన్ రైజర్’ ప్రోగ్రామ్స్ కంప్లీట్
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి వివరించేందుకు, ఆయా రాష్ట్రాల్లోని పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను ఆహ్వానించేందుకు ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో ఇప్పటికే కర్టెన్ రైజర్, రోడ్ షో లాంటి ప్రోగ్రామ్స్ పూర్తయ్యాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు ముగిశాయి. ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్‌కు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను, వివిధ దేశాల అంబాసిడర్లను ఆహ్వానించారు. సుమారు 40 దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వ అంచనా.
దీనికి తగినట్లుగా 3 రోజుల కార్యక్రమానికి వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలన్న లక్ష్యంతో సీఎం, చీఫ్ సెక్రటరీ తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలోని పనులపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సైతం పర్యవేక్షిస్తున్నారు. ముసాయిదా షెడ్యూలు ప్రకారం ప్యానెల్ డిస్కషన్స్ జరిగే వేదికల నిర్మాణంపై సూచనలు చేస్తున్నారు. దాదాపు 60 అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతున్నందున ఆయా రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు చర్చలో పాల్గొననున్నారు.
పెట్టుబడులపైనే ఫోకస్
గతేడాది సమ్మిట్‌లో దేశ, విదేశీ ప్రతినిధులకు ‘రైజింగ్ విజన్ 2047’ కాన్సెప్ట్‌ను ప్రభుత్వం వివరించింది. ఈసారి సమ్మిట్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, అక్కడి వివిధ క్యాంపస్‌లలో ఆయా రంగాల కంపెనీల యూనిట్ల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టనున్నది. గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలను ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం ఇప్పటికే ఫ్రాన్స్ పర్యటనలో పలు కంపెనీల ప్రతినిధులతో కలిసి కసరత్తు చేశారు. గతేడాది సమ్మిట్‌లో రూ.5.50 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంవోయూలు కుదరగా, ఈసారి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను గత మూడేండ్లుగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఎయిర్ స్పేస్, డిఫెన్స్ రంగాలకు ‘బెస్ట్ డెస్టినేషన్’గా ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ‘మేడిన్ హైదరాబాద్’ టాగ్ లైన్‌తో ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచంలోని పలు దేశాల్లో వినియోగానికి వచ్చేలా యూనిట్ల స్థాపన ఈసారి గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక అంశంగా ఉండనున్నది.

