ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు రేవంత్ కీలక హామీ

కలం, తెలంగాణ బ్యూరో: “గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను నేను చూడదలచుకున్నా.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ గిరిజన గూడెంలో ఇండ్లు మంజూరు చేస్తాం.. ఆదిలాబాద్ జిల్లాలోని గూడేల్లో ఒక్క గుడిసె కూడా కనిపించొద్దు.. అవసరమైన ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధిలో ముందుకు నడిపించాలన్నదే తమ ప్రయత్నమని, గిరిజన, ఆదివాసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే తమ ఆలోచన అని అన్నారు. పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలంటూ అడవి బిడ్డలు వచ్చి తనను కోరారని, వెంటనే నియోజకవర్గానికి 3500 ఇండ్లతో పాటు ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా 21 వేల ఇండ్లను మంజూరు చేశామని గుర్తుచేశారు.

“ఇండ్లులేనివారి లిస్టు తయారు చేసి మాకు ఇవ్వండి… ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది.. గూడేల్లో ఇండ్లు లేని పేదలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి పొంగులేటికి సూచిస్తున్నా.. స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆదివాసీ, గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోని ఇందిరమ్మ ఇండ్లకు గోడలు బాగున్నా పైకప్పు పాడై కొందరు ఇబ్బందులు పడుతున్నారు.. అలాంటివాటికి శ్లాబ్ వేసుకునేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని మంత్రికి సూచిస్తున్నా..” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘ఇందిరమ్మ ఇండ్ల’ బిల్లుల విడుదలలో ఒక్క రోజు కూడా జాప్యం చేయలేదని, అందుకే మొదటి ఏడాదిలోనే లక్ష ఇండ్లకు గృహ ప్రవేశాలు చేసుకున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 17న మరో లక్ష ఇండ్లకు గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. రెండో విడతలో భాగంగా మరో రెండున్నర లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టారు.

కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్ జిల్లాకు ఇస్తానని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పానని గుర్తుచేశారు. ఆదివాసీ గూడేలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది ప్రభుత్వం భావన అని అన్నారు. ఫస్ట్ ఫేజ్ ‘ఇందిరమ్మ ఇండ్ల’ స్కీమ్‌లో గృహప్రవేశాలు అయిన సందర్భంగా ఇక్కడి మహిళలకను చూస్తుంటే ఇప్పుడే దసరా పండగకు వచ్చినట్లుగా ఉందన్నారు. మహిళల ముఖాల్లో సంతోషం కంటే ఈ ప్రభుత్వానికి ఇంకేమీ ఎక్కువ ఏదీ కాదన్నారు. “అందరూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుని పిల్లల్ని బాగా చదివించుకోండి.. చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు వస్తుంది.. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగులు తెస్తుంది.. అందరూ మీ పిల్లల్ని చదివిస్తామని నాకు మాట ఇవ్వండి… వాళ్లు బాగుంటేనే మీ జీవితాలు బాగుపడుతాయి…” అని అన్నారు.

కాళేశ్వరం మూడేండ్లలోనే కూలేశ్వరమైంది :

“కాళేశ్వరం కట్టడం అది కూలేశ్వరం కావడం జరిగిపోయింది.. కానీ ఆదిలాబాద్‌కు జిల్లాలో ఒక్క ఎకరాకూ నీళ్లు రాలేదు.. అందుకే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాను.. కానీ ఆయన స్పందించడం లేదు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనై కదులుతుంది.. రైతులు ఉప్పెనై కదిలితే మహారాష్ట్రకు ఇబ్బందులు తప్పవు.. మా బాధను, అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలి.. తుమ్మిడిహెట్టి పూర్తయితే గ్రావిటీతో లక్షలాది ఎకరాలకు నీరు అందించొచ్చు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై గురుతర బాధ్యత ఉంది.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు.. లక్షలాది మంది రైతుల పక్షాన కిషన్ రెడ్డిగారు దూతగా వ్యవహరించాలి.. నాకు ఎలాంటి భేషజాలు లేవు… అవసరమైతే మీ ఇంటికి రావడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి సహకరించండి..” అని సీఎం అన్నారు.

పోలవరానికి ఏడు మండలాలే ఇచ్చేశారు.. :

పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలనే ఏపీకి ఇచ్చేసిన మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి రెండువేల ఎకరాలు ఇప్పించలేరా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాస్తుంటే కిషన్‌రెడ్డి ఆలోచనేంటో తెలియడం లేదన్నారు. తొలుత ఆయన ఆలోచనేంటో బయటపెట్టాలన్నారు. రైతు ప్రయోజనాల కోసం మోదీ అయినా, కిషన్‌రెడ్డి అయినా ఎవరినీ లెక్కచేయనన్నారు. “ఐ డోంట్ కేర్ ఎనీ వన్.. నాకు రైతుల ప్రయోజనమే ముఖ్యం..” అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 75 లక్షల క్వింటాళ్ల వరిధాన్యాన్ని సేకరించిందని, కానీ దీన్ని కొనడానికి కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం వడ్లు, మక్కలు కొనడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యం, మక్కలు కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నారు.

జూన్ 15 తర్వాత ‘అసలు’ కార్యాచరణ ఉంటుంది :

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుంటే జూన్ 15న కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతల ఇండ్ల ముందు పోస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్రం ఎట్లా కొనదో తేలుస్తామన్నారు. ధాన్యాన్ని కొనాలంటే కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని, లేదంటే తెలంగాణలో ఆయన తిరగడమే కష్టమవుతుందన్నారు. జూన్ 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని, ఇందుకు రైతులంతా మద్దతుగా నిలవాలని కోరారు. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని క్లారిటీ ఇచ్చారు. తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>