కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం తారాస్థాయికి చేరుకుందని, బాధితులు ఆత్మబలిదానాలకు పాల్పడే దుస్థితి దాపురించిందని సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార గర్వంతో కళ్లు మూసుకుపోయిన బీజేపీ నేతలకు బాధితుల ఆర్తనాదాలు, విన్నపాలు వినిపించడం లేదని ఆయన విమర్శించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం ఇంటి ఎదుట యూపీఎస్‌ఆర్‌టీసీ (UPSRTC) కాంట్రాక్ట్ కార్మికులు తమ జీవనోపాధి కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న డ్రైవర్లు, కండక్టర్ల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగం అనేది ఒక సామాన్యుడికి కేవలం ఉపాధి మాత్రమే కాదని, అది ఒక కుటుంబం యొక్క జీవన్మరణ సమస్య అని ఆయన గుర్తు చేశారు. ఒక కుటుంబీకుడి కష్టాన్ని మరో కుటుంబీకుడు మాత్రమే అర్థం చేసుకోగలరని చెప్పారు. ఇక బీజేపీ చాలంటూ ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. అనర్థాలు జరగకముందే ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

