కలం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్రానికి సంబంధించి అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చర్చించిన అంశాలను వివరించారు.
ఉత్తర తెలంగాణకు కేంద్రంగా వరంగల్..
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్లగొండ జిల్లాకు కేంద్రంగా ఉంటుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తయినందున టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు.
ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేసి 2028, జూన్ 2 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్లపై కేంద్ర మంత్రి, సీఎం చర్చించారు. వరంగల్‌కు ఘనమైన చరిత్ర ఉన్నందున, కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్ధం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. అందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సుముఖత వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో డిఫెన్స్, సివిల్ ఎయిర్‌పోర్టులు..
ఆదిలాబాద్ జిల్లాలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టుతో పాటు పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అవసరమైన భూమిని సేకరించి అందజేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ విమానాశ్రయం తరహాలోనే ఆదిలాబాద్‌లోనూ ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు నెలకొల్పాలన్నారు. రెండు చోట్లా విమాన శిక్షణ సంస్థలు నెలకొల్పి.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలన్నారు.
వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు ఉన్న మెరుగైన పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. వరంగల్ విమానాశ్రయం రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతో పాటు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతో కీలక నగరంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో పారిశ్రామికంగా మరింతగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సీ-ప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ప్రశంసలు..
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విమానాశ్రయాలతోనే అనేక దేశాలు అభివృద్ధి చెందాయని, విమానాశ్రయాల ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేనంత తొందరగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ చేసి ఇచ్చి చరిత్ర సృష్టించిందని అభినందించారు. భూ సేకరణ, ఇతర అంశాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ తరహాలో స్పందించాలని సూచించారు. వరంగల్ సంస్కృతికి అద్దం పట్టేలా విమానాశ్రయ డిజైన్ ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
రాజకీయాలతో సంబంధం లేదు: సీఎం రేవంత్
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాలు ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశాల అభివృద్ధిలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణలోనూ విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన, అభివృద్ధి ఉంటాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో తమకు సహకరిస్తోందన్నారు. సమస్యలుంటే కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి అంశాల్లో కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వస్తున్నామని, దానిపైనా రాజకీయంగా విమర్శలు చేయడం తగదని సీఎం హితవు పలికారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, పౌరవిమానయాన శాఖ సెక్రటరీ మురళీధర్ మోహోల్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

