కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania) మీద నమోదైన కోర్టు ధిక్కరణ కేసులు ఎన్నో తెలుసా?.. బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేశ్ కుమార్‌పై 440కు పైగా నమోదైతే చాలా మంది ఆశ్చర్యపోయారు! కానీ, సోమేశ్ కుమార్‌ను మించి సందీప్ సుల్తానియాపై ఏడు రెట్లకు పైగా ఆ కేసులు నమోదయ్యాయి. అవి.. అక్షరాలా మూడు వేల నూట ముప్పై రెండు (3,132). కేవలం రెండున్నరేండ్ల కాలంలోనే!! ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు నమోదైన కేసులు ఇవి.
ఇందులో కొన్ని డిస్పోజ్ కాగా.. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. సందీప్ సుల్తానియాను అరెస్టు చేసి తమ ముందు హాజరు పర్చాల్సిందిగా నగర పోలీసు కమిషనర్‌కు హైకోర్డు జడ్జి ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మరుసటి రోజే కోర్టులో హాజరయ్యారు. కేవలం కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగానే ఆయనపై కంటెప్ట్ కేసులు నమోదయ్యాయి.
సందీప్ కుమార్ సుల్తానియా ప్రస్తుతం రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండడంతో ఆ హోదాలో ఆయన కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోక తప్పడంలేదు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పేమెంట్స్, మెడికల్ బిల్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్స్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్.. ఇలాంటివన్నీ సకాలంలో క్లియర్ కాకపోవడంతో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆ పిటిషన్‌లోని అంశాల తీవ్రత దృష్ట్యా హైకోర్టు సదరు అధికారికి స్పష్టమైన ఆదేశాలను జారీచేస్తున్నది. ఆదేశించిన ప్రకారం వాటిని నిర్దిష్ట టైమ్‌లో అమలు చేయకపోవడంతో పిటిషనర్లు మరోసారి కోర్టును ఆశ్రయించి ధిక్కరణకు పాల్పడుతున్నారని విన్నవిస్తున్నారు. దీంతో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయి. సందీప్ సుల్తానియాపై కోర్టు ధిక్కరణ కేసులు 2025లో 1,171 నమోదైతే, 2026లో (జులై చివరి నాటికి) 1,961 రికార్డు అయ్యాయి. ఏడాదిన్నర కాలంలో మొత్తంగా 3,132 కోర్టు ధిక్కరణ కేసులు ఆయన ఒక్కడిపైనే నమోదయ్యాయి.
ప్రభుత్వానికి తలనొప్పిగా కేసులు
– గత ప్రభుత్వంలోనైనా, ఇప్పుడైనా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కోర్టుల్లో ధిక్కరణ కేసులు నమోదు కావడం అటు అధికారుల్లో అలజడిని సృష్టిస్తుండగా.. ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నది.
– నాడు సోమేశ్ కుమార్ రెవెన్యూ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్)గా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసులు, కోర్టు తీర్పులను అమలు చేయని కారణంగా నమోదైన కోర్టు ధిక్కరణ కేసులు ఎక్కువగా భూములకు సంబంధించినవే.
– ఇప్పుడు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సందీప్ సుల్తానియాపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులు ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలవే. ఏడాదిన్నర కాలంలో మొత్తం 3,132 కేసులు నమోదైతే అందులో ఒక వంతు (1,044 కేసులు) మాత్రమే డిస్పోజ్ అయ్యాయి. ఇంకా రెండొంతులు (2,088 కేసులు) పెండింగ్‌లోనే ఉన్నాయి.
– ఉద్యోగులకు ఫండ్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేయలేకపోతున్నారు.
ఒక్కో అప్పియరెన్స్‌కు సగటున రూ. 10 వేలు!
అధికారులపై నమోదైన కేసులు, కోర్టు ధిక్కరణ కేసుల విచారణకు అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ మొదలు గవర్నమెంట్ ప్లీడర్ వరకు ప్రభుత్వమే విచారణ ఖర్చులను భరిస్తున్నది. ఒక్కో అప్పియరెన్స్ (విచారణకు హాజరుకావడం) సగటున రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ప్రతి నెలా రూ. 20 లక్షలకు పైగానే ఖజానా నుంచి వెచ్చించాల్సి వస్తున్నది. ఉదాహరణకు గతేడాది సెప్టెంబర్లో అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డికి రూ. 11,30,500 విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 10,11,500 విడుదల చేసింది. ఇదే నెలకు అడ్వకేట్ జనరల్‌కు రూ. 13,90,000 విడుదల చేసింది.
గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కింద రూ. 58,95,63,000 విడుదల చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీవో నెం. 208/07.06.2021) జారీచేసింది. ఈ డబ్బంతా ఆయనపై హైకోర్టులో నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చు కోసమేనని ఆ ఉత్తర్వుల్లో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమారే పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి విచారణ డబ్బులను ఖజానా నుంచి కాకుండా సదరు అధికారి సొంత నిధుల నుంచి ఇవ్వాలంటూ గతంలో పలు కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.
సందీప్ సుల్తానియాపై 2025 జనవరి నుంచి 2026 జులై చివరి వరకు..
మొత్తం కోర్టు ధిక్కరణ కేసులు : 3,132
ఇందులో డిస్పోజ్ అయినవి : 1,044
ఇంకా పెండింగ్‌లో ఉన్నవి : 2,088

