నేరాలు పెరిగిపోతున్నాయ్‌..!

కలం, క్రైమ్ బ్యూరో: తెలంగాణలో క్రైమ్ (Telangana Crime) రేట్ పెరిగింది. గత మూడేళ్లలో ఓవరాల్ క్రైమ్ రేట్ 7.15 శాతం పెరిగింది. శుక్రవారం హైదరాబాద్‎లోని డీజీపీ కార్యాలయంలో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేరాలకు సంబంధించిన వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) వెల్లడించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో నేరాలు 7.15 శాతం పెరిగాయి. 2023-24లో 2,65,377 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య 2025-26 నాటికి 2,84,363కు చేరింది. డ్రగ్ కేసులు దాదాపు 50 శాతం పెరిగాయి. ఈ కేసులు 2023-24 లో 2,026 నమోదు కాగా, 2025-26లో 2,960 నమోదయ్యాయి. అంటే మూడేళ్లలో 46.10 శాతం పెరిగాయి. అత్యధికంగా వరంగల్‌లో 142 శాతం, సైబరాబాద్‌లో 90 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ 25 నుంచి 451కి చేరి 1,704 శాతం పెరగ్గా.. ట్రాఫిక్‌ నేరాలు 9.48 శాతం పెరిగాయి.

తగ్గిన తీవ్ర నేరాలు

= రాష్ట్రంలో సాధారణ నేరాల సంఖ్య పెరిగింది. 2023-24లో 2,59,201 కేసులు నమోదు కాగా, 2025-26లో 2,78,069 కేసులు నమోదయ్యాయి. మూడేళ్లలో 7.28 శాతం పెరిగాయి. కమిషనరేట్ల వారీగా చూస్తే ఫ్యూచర్‌ సిటీలో 23.70 శాతం, సైబరాబాద్‌లో 17.32 శాతం, మల్కాజిగిరిలో 13.53 శాతం కేసులు పెరిగాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో మాత్రం 2.77 శాతం తగ్గాయి.
= జిల్లాల విషయానికి వస్తే ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణ నేరాలు పెరిగాయి.
= రాష్ట్రంలో సాధారణ నేరాలు పెరిగినప్పటికీ, తీవ్ర నేరాలు తగ్గాయి. 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా, 2025-26లో 6,294 నమోదయ్యాయి. ఏడాది వ్యవధిలో 10.33 శాతం తగ్గాయి. ములుగు, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మాత్రం తీవ్ర నేరాలు పెరిగాయి.

తగ్గిన ట్రాఫిక్ నేరాలు

= రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గాయి. 2024-25లో 31,593 కేసులు నమోదుకాగా, 2025-26లో 31,108కి తగ్గాయి. ఏడాదిలో 1.54 శాతం తగ్గగా, 2023-24తో పోలిస్తే 3.81 శాతం పెరిగాయి.
= హైదరాబాద్‌, సైబరాబాద్‌, వరంగల్‌ కమిషనరేట్లలో కేసులు తగ్గగా, ఫ్యూచర్‌ సిటీలో మాత్రం పెరిగాయి. ఖమ్మం, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, నారాయణపేట, ములుగులోనూ పెరిగాయి.
= రాష్ట్రంలో ట్రాఫిక్‌ నేరాలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. 2023-24లో 29,130 కేసులు రికార్డు కాగా, 2025-26లో 31,891కి చేరాయి. మూడేళ్లలో 9.48 శాతం పెరిగాయి.
= సైబర్‌ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29 శాతం తగ్గాయి. ఆర్థిక నేరాల్లోనూ 13.28 శాతం తగ్గుదల నమోదైంది.

నేరాల నియంత్రణపై దృష్టిపెట్టాలి: డీజీపీ

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పోలీస్ అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్‌ దిశానిర్దేశం చేశారు. నెలవారీ సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాలను కట్టడి చేయాలని సూచించారు. నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>