కలం, కరీంనగర్ బ్యూరో: జల్సాలకు అలవాటు పడ్డ ఓ పాత నేరస్థుడు శ్రీచైతన్య కాలేజీకి కన్నం పెట్టాడు. కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య కాలేజీలో నగదు ఎత్తుకెళ్లాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రూ. 5 లక్షల నగదు, 10 తులాల బంగారం సీజ్ చేశారు. కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కే సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ (32) పాత నేరస్థుడు. గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోలేదు.
తాళాలు పగలగొట్టి చోరీ
ఈ నెల 26న తెల్లవారుజామున మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన రూ. 5 లక్షల నగదును, ఒక గోల్డ్ చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. కాలేజీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్‌లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నది. నిందితుడు గతంలోనే చింతకుంట ఆంజనేయస్వామి గుడిలో హుండీ దొంగతనం కూడా అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నేర ప్రవృత్తి గల వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందని, దొంగతనాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. సకాలంలో నిందితుడిని పట్టుకుని సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అభినందించారు.

