Mobile Popup Ad
Mobile Popup Ad

మినిస్టర్ మాజీ ఓఎస్డీ రీ ఎంట్రీ.. రివ్యూలో ఆమె పక్కనే

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) గతంలో ఓఎస్డీ (OSD)గా పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగి ఎన్.సుమంత్‌ (Sumanth) మళ్లీ యాక్టివ్ అయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో సుమంత్‌ను ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఆ బాధ్యతల నుంచి తొలగించింది. అప్పటి నుంచి అధికారిక కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. తాజాగా నగరంలోని హరిణ వనస్థలి పార్కులో అనన్య రిసార్టుపై మంత్రి కొండా సురేఖ సోమవారం జరిపిన ఆకస్మిక తనిఖీ ప్రోగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యారు. రిసార్టు నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి ఆమె తనీఖీలు నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన సుమంత్ మంత్రికి ఓఎస్డీగా తొలుత ఏడాది కాలానికి 2023 డిసెంబరు 17న నియమితులయ్యారు. ఆ గడువు 2024 డిసెంబరు 16తో ముగిసింది. ఆ తర్వాత  మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలల ముందుగానే గత ఏడాది అక్టోబర్ లో ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.

అవినీతి ఆరోపణలతో పక్కకు పెట్టిన సర్కార్ :

మంత్రికి ఓఎస్డీగా ఉంటున్న సుమంత్ (OSD Sumanth) భారీ స్థాయి అవకతవకలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు రావడంతో వాటిపై దర్యాప్తు జరిపించాలని భావించిన ప్రభుత్వం.. ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ గతేడాది అక్టోబరు 14న ఉత్తర్వులు ఇచ్చింది. కస్టడీలోకి తీసుకుని విచారించాలన్న ఉద్దేశంతో ఆయనను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు మంత్రి నివాసానికి వెళ్లారు. సుమంత్ ఇక్కడే ఉన్నట్లు తెలిసిందని, ఆయనను అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో పోలీసులకు, మంత్రి కుమార్తె సుష్మితకు మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. ఒక దశలో ముఖ్యమంత్రిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డిపైన ఆరోపణలు కూడా చేశారు. అప్పట్లో అది వివాదానికి దారితీసింది. ఆ తర్వాత సుష్మిత క్షమాపణలు కూడా చెప్పారు.

మళ్లీ మంత్రి వెంటనే సుమంత్ ప్రతక్ష్యం :

ప్రభుత్వం ఆయనను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తొలగించినా మంత్రి కొండా సురేఖ పాల్గొనే ప్రోగ్రామ్స్ లోనే కనిపిస్తుండడం సచివాలయంలో కూడా చర్చలకు దారితీసింది. ప్రభుత్వం తొలగించినా మంత్రి ఎందుకు ఆయనను వెనకేసుకొస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తొలగించినా ఇప్పుడు ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఆయనను మంత్రి పరోక్షంగా ప్రోత్సహించడం వివాదాస్పదమైంది. అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేలా ఎంకరేజ్ చేయడాన్నీ సచివాలయ వర్గాల్లో కొందరు తప్పుపడుతున్నారు. హరిణి వనస్థలిపై సమీక్ష సందర్భంగా సుమంత్ ఏ హోదాలో పాల్గొన్నారనే ప్రశ్నకు సమాధానం కరువైంది. సుమంత్ తీరు కారణంగానే గతంలో ఒకరిద్దరు మానేయాల్సి వచ్చిందని, తాజాగా ఒక ప్రైవేటు ఉద్యోగి సైతం వెళ్లిపోయారనే అంశాన్ని ఆ వర్గాలు గుర్తుచేశాయి.

పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినా…

సుమంత్ వ్యవహారంపై స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ  వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరకు వెళ్లి సంజాయిషీ చెప్పుకోవలిసి వచ్చింది. సుమంత్ వ్యవహారశైలి ఆ మంత్రిత్వశాఖలో అనేక చర్చలకు, అసంతృప్తికి దారి తీసినా మంత్రి కొండా సురేఖ ఇప్పటికీ ఆయనను వెనకేసుకురావడం ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి మింగుడుపడటం లేదు. గతంలోనే పార్టీకీ, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని స్పష్టంగా బహిర్గతమైనా మంత్రి కొండా సురేఖ మాత్రం సుమంత్ ను ఎంకరేజ్ చేయడం సమీప భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే గుసగుసలు మొదలయ్యాయి. ప్రభుత్వమే ఆయనను పక్కన పెట్టినా ఆ ఉత్తర్వులను కాదని మంత్రి భిన్నమైన తీరులో వ్యవహరించడం రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలకు తావిస్తుందో అనే అనుమానాలు లేకపోలేదు.

Read Also: ఇరాన్ లో వార్.. ఇక్కడ బేజార్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>