అదరహో కోహ్లీ.. ఆర్సీబీ చేతిలో గుజరాత్ చిత్తుచిత్తు..

కలం, స్పోర్ట్స్​ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తమకు తిరుగులేదని ఆర్‌సీబీ మరోసారి నిరూపించుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ (RCB vs GT)లో ఆర్‌సీబీ బ్యాటర్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ 81 పరుగులతో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ అయిపోతుందని అంతా ఆశపడినా.. కోహ్లీ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. భారీ లక్ష్యం ముందున్నా ఏమాత్రం బెదరకుండా ఆర్‌సీబీ వీరోచిత విజయాన్ని (RCB vs GT) అందుకుంది. సాయి సుదర్శన్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 206 పరుగుల భారీ టార్గెట్‌ను బెంగళూరు బ్యాటర్లు మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఊదేశారు. విరాట్ కోహ్లీ క్లాస్, దేవదత్ పడిక్కల్ మాస్ ఇన్నింగ్స్‌తో టైటాన్స్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 పరుగులు చేసి ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచాడు. ఇతడి స్కోరులో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (32) సుదర్శన్‌కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 12.4 ఓవర్లలోనే 128 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్‌లో జోస్ బట్లర్ 16 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ కాగా, చివర్లో వాషింగ్టన్ సుందర్ (19 నాటౌట్), జేసన్ హోల్డర్ (23 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా హోల్డర్ కేవలం 10 బంతుల్లోనే 2 సిక్సర్లతో విరుచుకుపడటంతో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు. కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి భారీగా ఖర్చు చేశాడు.

206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బెథెల్ (14) త్వరగానే వెనుదిరిగినా, విరాట్ కోహ్లీ మొండిగా క్రీజులో నిలబడ్డాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు బాది జట్టును గెలుపు బాటలో నడిపించాడు. కోహ్లీకి తోడుగా దేవదత్ పడిక్కల్ ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 6 సిక్సర్లతో 55 పరుగులు పిండుకుని రన్ రేట్‌ను అదుపులో ఉంచాడు. మధ్యలో జితేష్ శర్మ (10), రజత్ పటిదార్ (8) తక్కువ స్కోర్లకే అవుటైనా ఆర్‌సీబీ పట్టు కోల్పోలేదు. చివర్లో కృనాల్ పాండ్యా బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. కేవలం 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఆర్‌సీబీ 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసినా 49 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్, హోల్డర్, సుతార్ తలో వికెట్ దక్కించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>