కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) జైత్రయాత్రను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన ఫామ్‌ను కొనసాగిస్తే రాజస్థాన్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత 2025 సీజన్‌లో సంజూ శామ్సన్ (Sanju Samson) గాయపడటంతో జట్టులోకి వచ్చిన వైభవ్ (Vaibhav Suryavanshi), అనతి కాలంలోనే అద్భుత ముద్ర వేశారు. కేవలం 35 బంతుల్లోనే గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, గత సీజన్‌లో 206 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. ఇటీవల జింబాబ్వేలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ రాణించడంతో ఈ రెండో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, అతను ఇంకా చిన్నవాడు కాబట్టి సోషల్ మీడియా చర్చలతో అనవసర ఒత్తిడికి గురి చేయకూడదని అశ్విన్ సూచించారు. ప్రత్యర్థి జట్లు వైభవ్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాయని, అయినప్పటికీ అతను తన సహజ సిద్ధమైన దూకుడును కొనసాగించాలని ఆకాంక్షించారు. సంజూ శామ్సన్ నిష్క్రమణ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలను రియాన్ పరాగ్‌కు అప్పగించింది. దీనిపై అశ్విన్ స్పందిస్తూ, అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించి, పరాగ్‌ను వైస్ కెప్టెన్‌గా పెట్టి ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెప్టెన్సీ అనేది అంత సులభమైన విషయం కాదని, జోఫ్రా ఆర్చర్, బిష్ణోయ్ వంటి బౌలర్లు రాణిస్తే పరాగ్ పని సులభమవుతుందని తెలిపారు. అలాగే భవిష్యత్తు నాయకుడిగా యశస్వి జైస్వాల్‌ను కూడా సిద్ధం చేయాలని ఆయన (Ravichandran Ashwin) మేనేజ్‌మెంట్‌కు సూచించారు.
Read Also: మా ఇండ్లు కూల్చొద్దు.. రాహుల్ గాంధీకి చిన్నారుల పోస్ట్ కార్డ్స్!
Follow Us On : WhatsApp

