కలం, వెబ్ డెస్క్: జమ్మూ-కాశ్మీర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం ఉధంపూర్ మార్గంలో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందగా, చాలామందికి తీవ్ర గాయాలయ్యాయని అక్కడి పోలీసులు వెల్లడించారు. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ (Udhampur) వెళ్తుండగా మధ్యలో జాలో అనే ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉంధంపూర్ డీఐజీ శివకుమార్ శర్మ పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో మలుపు వద్ద దారి కనిపించకపోవడం వల్లే ఉదయం సుమారు 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని వివరించారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని.. 15 మంది మృతి చెందినట్టు గుర్తించినట్లు తెలిపారు. మరో 20 మందికి తీవ్రంగా గాయలయ్యాయని చెప్పారు. ఘటనా స్థలం నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నామని.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) డిప్యూటీ కమిషనర్ తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు.

