Mobile Popup Ad
Mobile Popup Ad

ఎంతో మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడింది తెలంగాణ: రామ్ చందర్ రావు

కలం, వెబ్ డెస్క్: నేటి తెలంగాణ రాష్ట్రం.. యువకులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు చేసిన అపార త్యాగాల ఫలితం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు (Ramchander Rao) కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ప్రజా ఉద్యమంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1200 మందికి పైగా యువకుల బలిదానాలు, ఎంతోమంది త్యాగాల పునాదుల మీద మన తెలంగాణ ఏర్పడిందని ఉద్యమకాలాన్ని గుర్తు చేశారు.

చారిత్రాత్మక ప్రజా ఉద్యమం తెలంగాణ స్వంతం..

తెలంగాణ కేవలం ఒక సాధారణ రాష్ట్రం కాదని.. రాష్ట్ర ఆవిర్భావం (Telangana Formation Day) వెనుక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, అసంఖ్యాక త్యాగాలతో కూడిన సుదీర్ఘమైన చారిత్రాత్మక ప్రజా ఉద్యమం ఉందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, బీజేపీ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫొటో ఎగ్జిబిషన్, తెలంగాణ స్టాల్స్ ఏర్పాటు చేశారు.

సుష్మాస్వరాజ్ సేవలను స్మరించుకుందాం..

తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్‌లో తెలంగాణ కోసం దృఢంగా నిలబడకపోయి ఉంటే, తెలంగాణ గొంతు అంత శక్తివంతంగా వినిపించేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆమె చేసిన అమూల్యమైన కృషిని ఎల్లప్పుడూ గాఢ కృతజ్ఞతతో స్మరించుకుంకుందామని చెప్పారు. ఈ రోజు ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘వికసిత్ తెలంగాణ’ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారంతోనే ‘వికసిత్ భారత్’ సాకారం అవుతుందని రామ్ చందర్ రావు అభిప్రాయపడ్డారు.

తెలుగు ప్రజలమైన మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయని.. మన మధ్య ఎలాంటి ద్వేషాలు, విభేదాలు ఉండకూడదని చెప్పారు. అభివృద్ధి విషయంలో మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పారు. పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ ప్రగతి పథంలో ముందుకు సాగగలవని అభిప్రాయపడ్డారు. అనేక త్యాగాలు, అచంచల సంకల్పం, అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని.. ఆత్మగౌరవం, స్వీయ అస్తిత్వం, స్వపరిపాలన కోసం జరిగిన ప్రజా ఉద్యమానికి ప్రతీక అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>