Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ పాలనలో ప్రగతికి పక్షవాతం: మెచ్చా నాగేశ్వరరావు

కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ పదేళ్ల పాల‌న‌లో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) చేతకానితనంతో పక్షవాతం వచ్చినట్లు ఎక్కడికక్కడ కుంటుపడిపోయిందని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దమ్మపేట మండలంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రోడ్డు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన పెండింగ్ పనులను కూడా పూర్తిచేయలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందన్నారు. దమ్మపేటలో ఆగిపోయిన రోడ్లే ఈ ప్రభుత్వ అసమర్థతకు సజీవ సాక్ష్యమని మండిపడ్డారు. కొత్త పనులు తీసుకురావడం చేతకాని ఈ ప్రభుత్వం, పాత పనులను సైతం గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు వేదికలెక్కి గొప్పలు చెప్పుకోవడం కాదు.. అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల గురించి కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని హితవు పలికారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధికి, కాంగ్రెస్ చేతకానితనంతో ఆగిపోయిన పనులకు ఈ రోడ్లే నిదర్శనమన్నారు.

​దమ్మపేట మండలంలో అభివృద్ధి శూన్యమనడానికి ఇక్కడి రహదారుల పరిస్థితే అద్దం పడుతోందని మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో ఎంతో ఆర్భాటంగా మొదలైన మల్లారం రోడ్డు పనులను ప్రస్తుత ప్రభుత్వం మధ్యలోనే నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గాంధీనగర్-మందలపల్లి రోడ్డు మార్గంలో పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయి ప్రజలకు నరకం చూపిస్తున్నాయని చెప్పారు. మందలపల్లి సబ్-స్టేషన్ లోపలి వైపు వెళ్లే మార్గాన్ని సైతం పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఇక జలవాగు రోడ్డు పనులు అడుగు ముందుకు పడక అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దగొల్లగూడెం-మల్కారం రోడ్డు మధ్యలో ఉన్న ‘లంక’ వద్ద పనులను నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. గుత్తావారిగూడెం-గంగులగూడెం రోడ్డు పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని ఆయన వివరించారు.​ప్రభుత్వం తక్షణమే తన మొద్దునిద్ర వీడి ఈ పెండింగ్ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి, వారి పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>