కలం, కరీంనగర్ బ్యూరో: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, ఆరెపల్లి, కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంగళవారం సాయంత్రం ఆయన కాంగ్రెస్ నాయకులతోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చింతకుంటలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల పురోగతిని సమీక్షించారు.
డబుల్ ఇండ్ల పరిశీలన
ఇప్పటివరకు ఎంత మేర పనులు పూర్తి అయ్యాయి, ఇంకా చేపట్టాల్సిన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆరెపల్లి, బద్దిపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో మిగిలి ఉన్న పనుల వివరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
త్వరలో లబ్ధిదారులకు పంపిణీ
చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను త్వరలోనే ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. నాడైనా నేడైనా సొంతింటి కలను నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, గుమ్మడి రాజ్‌కుమార్, ఆకుల నందిని ఉదయ్, కాంగ్రెస్ నాయకులు అర్ష మల్లేశం, ఖదీర్ షా ఖాన్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

