కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ (RR) కీలక అడుగు వేసింది. మంగళవారం లక్నో సూపర్ జాయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ చేరడానికి ఆ జట్టు కేవలం ఒకే ఒక్క విజయం దూరంలో నిలిచింది. అయితే, ఇంతటి ఉత్సాహభరిత విజయం తర్వాత కూడా రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) తీవ్ర అసంతృప్తితో కనిపించారు. మైదానం వెలుపల తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్న ఐపీఎల్ కామెంటేటర్లు, విమర్శకులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అయితే, ఇటీవల ఒక ‘వేపింగ్ వివాదం’లో చిక్కుకున్న పరాగ్‌ను మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న అడిగారు. తన గురించి బయట రాస్తున్న లేదా మాట్లాడుతున్న విషయాలను ఎలా ఎదుర్కొంటున్నారని ప్రశ్నించగా పరాగ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
తాను ఏం చేసినా జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారనే నిజాన్ని తాను పూర్తిగా గ్రహించానని పరాగ్ స్పష్టం చేశారు. బయట జరిగే ప్రచారాలు తన ఆటను, తన ఫామ్‌ను లేదా తన మైండ్‌సెట్‌ను అస్సలు దెబ్బతీయలేవన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసే ఈ ‘కీబోర్డ్ వారియర్స్’ ముచ్చట్లను మైదానం బయటే వదిలేయాలని, తన ఆటపై తనకు పూర్తి నమ్మకం ఉందని తేల్చి చెప్పారు. క్రికెట్ మైదానం వెలుపల జరిగే విషయాలపై, ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేసే కొందరు నిపుణులు, కామెంటేటర్లపై పరాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ఎంతో కష్టపడతారని, మ్యాచ్‌లో తప్పులు జరగడం సర్వసాధారణమని చెప్పారు.
ఏదైనా మ్యాచ్‌లో ఒక టీమ్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయినప్పుడు, వారికి ఆడటం రాదనో లేదా ఆడటం ఇష్టం లేదనో అనడం చాలా సులభమని విమర్శించారు. ప్రతి మ్యాచ్ కోసం రోజులు తరబడి ప్రిపేర్ అవుతామని, కానీ కొన్నిసార్లు ప్లాన్స్ వర్కవుట్ కావని, తాము కూడా మనుషులమేనని గుర్తు చేశారు. కామెంటేటర్ల మాటలు నేరుగా కోట్ల మంది ప్రజలకు చేరుతాయని, కాబట్టి వారు కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడాలని కోరారు. ఈ దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న క్రికెట్ ఆటను గౌరవించాలని, మైదానంలో ఆట గురించి తప్ప వేరే విషయాల జోలికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు.

