కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి ‘రైతు ఆశీర్వాద సభ’ (Rythu Ashirvada Sabha) నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ సభ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుగా సోమవారం (జూన్ 29) మత్కెపల్లి క్రాస్ రోడ్, జగన్నాధపురం గ్రామంలో జరగాల్సిన ‘మెగా రైతు మేళా’ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే మంగళవారం జరగాల్సిన సీఎం ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహణపై సోమవారం ఉదయం తానే స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి, వర్షం తీవ్రతను బట్టి సభ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సోమవారం నాటి రైతు మేళా పూర్తిగా రద్దయిన నేపథ్యంలో, మంగళవారం సభపై సోమవారం మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం వర్గాలు తెలిపాయి.

