Popup Ad
Popup Ad

తెలంగాణ ‘బొగ్గు బెల్ట్’ ఆర్థిక ముఖచిత్రం మార్చే మెగా ప్రాజెక్టుకు ఆమోదం

కలం, ఖమ్మం బ్యూరో: ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ‘రామగుండం-మణుగూర్‌’ (Ramagundam-Manuguru Rail Line) నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి రైల్వే బోర్డు తాజాగా మే 20, 2026న అధికారికంగా తుది ఆమోదం ఇచ్చింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో రూ. 5,818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనున్నారు. అంతకుముందు ఏప్రిల్ 10న జరిగిన కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పీపీపీ అప్రైజల్ కమిటీ 144వ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం లభించగా, తాజాగా రైల్వే బోర్డు పచ్చజెండా ఊపడంతో ఈ లైన్ నిర్మాణానికి ఉన్న అవరోధాలన్నీ తొలిగిపోయాయి.

2026-27 బడ్జెట్‌లోరూ. 2,911 కోట్ల 84 లక్షలు..

​ఈ ప్రాజెక్టుకు 2004లో తొలి అడుగు పడగా, 2009లో లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో సర్వేకు నిధులు కేటాయించారు. ఆ తర్వాత ప్రతీ బడ్జెట్‌లోనూ ఈ రైల్వేలైన్ ప్రస్తావన వస్తున్నప్పటికీ నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు కేంద్రం స్పందించింది. 2023-24 బడ్జెట్లో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం రూ. 360 కోట్లు కేటాయించగా, తాజాగా ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ఏకంగా రూ. 2,911 కోట్ల 84 లక్షలను ఈ మార్గానికి కేటాయించారు.

తగ్గనున్న 90 కిలోమీటర్ల మేర ప్రయాణం..

​మొత్తం 207.80 కిలోమీటర్ల పొడవు గల ఈ నూతన రైల్వేలైన్ పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమై మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపూర్‌, గోపాల్‌రావుపేట్‌, రామానుజవరం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్‌ వరకు సాగనుంది. ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూర్‌ వెళ్లాలంటే కాజీపేట, డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌ మీదుగా చుట్టూ తిరిగి 291 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త లైన్‌ అందుబాటులోకి వస్తే దాదాపు 90 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గనుంది. ఈ ప్రాజెక్టు కోసం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కావాల్సిన భూసేకరణ చేపట్టేందుకు గత ఏడాది మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఇప్పటికే మూడు రకాల మార్గాల్లో ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి, తక్కువ దూరంతో పాటు భూసేకరణకు తక్కువ ఆటంకాలు ఉన్న రూట్‌ను ఖరారు చేశారు. రైలు మార్గంలో మట్టి నమూనాల పరీక్షలు కూడా పూర్తవడంతో ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.

మారనున్న కోల్ బెల్ట్ ఆర్థిక ముఖచిత్రం..

​ఈ నూతన రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు దూరభారం తగ్గడంతో పాటు, బొగ్గు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా బొగ్గు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉన్న కొత్తగూడెం, మణుగూరు వంటి ప్రాంతాలకు ఈ లైన్ ద్వారా రవాణా వ్యవస్థ మెరుగు పడనుంది. న్యూఢిల్లీ – చెన్నై గ్రాండ్‌ ట్రంక్‌ లైన్‌లోని నాగ్‌పూర్-విజయవాడ సెక్షన్‌కు ఇది అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారబోతోంది. దీనికి తోడు, భవిష్యత్తులో ప్రతిపాదిత భద్రాచలం రోడ్‌-కొవ్వూర్‌ లైన్‌ కూడా పూర్తయితే ఈ మార్గం నేరుగా విశాఖపట్నం లైన్‌కు అనుసంధానమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి భారీ లైన్ నిర్మాణం పూర్తిగా అందుబాటులోకి రావడానికి 10 నుంచి 15 ఏళ్ల సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ, రైల్వే శాఖ మాత్రం భూసేకరణతో కలిపి రాబోయే ఐదేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం. ఈ మెగా ప్రాజెక్టుతో తెలంగాణ కోల్ బెల్ట్ ప్రాంతం యొక్క ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>