కలం, వెబ్‌డెస్క్: నీట్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తున్నదని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. విద్యావ్యవస్థను ప్రశ్నించడమే వారు చేసిన నేరమా? అంటూ ప్రశ్నించారు. 15 ఏళ్ల బాలికతో బీజేపీ నేతలు బలవంతంగా క్షమాపణ చెప్పించారని మండిపడ్డారు. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాల్సింది పోయి.. తాను విద్యార్థులను క్షమిస్తున్నానని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. జెన్‌జెడ్ ఉద్యమంలో పాల్గొన్న ఐదుగురు విద్యార్థి నిరసనకారులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమయ్యారు. ఉద్యమంలో విద్యార్థులు ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. నిరసనల సమయంలో తమపై దాడులు జరిగాయని, ఉద్యమం ముగిసిన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లో వేధింపులు కొనసాగాయని విద్యార్థులు చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు.
మోదీ, షాకు విద్యార్థుల ముందు మాట్లాడే దమ్ముందా?
నీట్ సమస్యపై విద్యార్థుల ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఉందా? అని ప్రశ్నించారు. నిరసనకారులపై పెలెట్ గన్స్ ఉపయోగించారని వచ్చిన ఆరోపణల విషయంలో అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఈ ఘటన తెలియకపోతే అసమర్థుడిగా భావించాల్సి వస్తుందని.. తెలిసి జరిగి ఉంటే బాధ్యుడని వ్యాఖ్యానించారు. తమకు కావలసింది పనిచేసే విద్యా వ్యవస్థ, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలకు ముగింపు, యువత భవిష్యత్తుకు రక్షణ అని స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దేశ చరిత్రను ఒకే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి తన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే హక్కు ఉందని, భారత వైవిధ్యాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా దేశం సహించదని ఆయన అన్నారు.

