కలం, మెదక్ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ముఖ్యమంత్రులెవరికీ సంగారెడ్డి పర్యటన (CM Sangareddy Visit) కలిసిరాలేదనే సెంటిమెంట్ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నది. ఈ జిల్లాలో అధికారిక కార్యక్రమాలు లేదా ఎన్నికల ప్రచారం కోసం పర్యటించిన సీఎంలు.. ఆ తర్వాత పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సంగారెడ్డిలో సీఎంల పర్యటన వాళ్ల పొలిటికల్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చిందనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా నెలకొన్నది. ఇందుకు గతంలో జరిగిన సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు మొదలు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ వరకు పవర్ కోల్పోయిన సందర్భాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటనకు వెళ్తుండడంతో ఈ సెంటిమెంట్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఈ నెల 15న పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన తర్వాత సాయంత్రం సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే సీఎం పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికను ఖరారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఎదుగుదలను ఓర్వలేని కాంగ్రెస్ నేతలపై విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యూహాత్మకమా? ఉద్దేశపూర్వకమా?
రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వేదిక ఎంపిక వెనక నిర్దిష్టమైన వ్యూహం ఉన్నదా? యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకున్నారా? గతంలోని అనుభవాల రీత్యా ఈసారి సీఎం వచ్చి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది? ఇలాంటి చర్చలు ప్రజల్లో జోరుగా సాగుతున్నాయి.
గతంలో జరిగిన సంఘటనలివీ..
చంద్రబాబు:2003 మే 23న ఫ్లోరైడ్ నివారణ, కరువు పరిస్థితులపై చర్చించేందుకు జిల్లా సమీక్షా సమావేశానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
కొణిజేటి రోశయ్య: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలో కొణిజేటి రోశయ్య 2010 నవంబరు 18న సంగారెడ్డి టౌన్‌లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ 125వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. మెదక్ జిల్లాను ‘ఇందిరమ్మ జిల్లా’గా మారుస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు.
కిరణ్ కుమార్ రెడ్డి: ఉమ్మడి ఏపీ సీఎం హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి ‘ఇందిరమ్మ బాట’ పేరుతో 2012 డిసెంబర్ 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆయన సీఎం పదవి కోల్పోయారు.
కేసీఆర్: మెదక్ మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి మృతి చెందినప్పుడు 2018 ఆగస్టు 19న అప్పటి సీఎం కేసీఆర్ సంగారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌కు వచ్చారు. ఆ తర్వాత 2023 నవంబర్ 27న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయారు.

